ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 28 August 2026, 7:39 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

నారాయణరావు కుటుంబ సభ్యులను పరామర్శించిన చిరంజీవి

హైదరాబాద్, ఆగస్టు 28,అర్జున్ సమాచారం:
రచయిత, నటుడు, తన మిత్రుడు జీవీ నారాయణరావు భౌతికకాయానికి మెగాస్టార్ చిరంజీవి నివాళులర్పించారు. ఆయన పార్థివ దేహానికి పూలమాల వేసి అంజలి ఘటించిన చిరంజీవి… అనంతరం నారాయణరావు కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతిని తెలిపారు. తన ఆప్తమిత్రుడితో ఉన్న దశాబ్దాల సుదీర్ఘ అనుబంధాన్ని, చివరి జ్ఞాపకాలను ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.1977 నుంచి తమ ఇద్దరి మధ్య పరిచయం ఉందని, ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందుతున్న సమయంలో నారాయణరావు తమకు సీనియర్ విద్యార్థిగా ఉండే వారని చిరంజీవి తెలిపారు. అప్పట్లోనే ఆయన తన నటనా అనుభవాలను తమతో పంచుకుంటూ ఎంతో చొరవగా ఉండేవారని చెప్పారు. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎవరి సినిమాల్లో వారు బిజీ అయిపోయామని తెలిపారు. తన కొన్ని చిత్రాల్లోనూ నారాయణరావు కీలక పాత్రలు పోషించారని గుర్తుచేశారు. ఆ తర్వాత వ్యక్తిగత, వృత్తిపరమైన బాధ్యతల వల్ల ఇద్దరి మధ్య కొంత గ్యాప్ వచ్చినట్లు పేర్కొన్నారు.నారాయణరావుతో తనకు జరిగిన చివరి కలయిక గురించి చెబుతూ చిరంజీవి మరింత భావోద్వేగానికి గురయ్యారు. కేవలం పది రోజుల క్రితమే తాము నటించిన ‘మంచుపల్లకి’ చిత్రాన్ని మళ్లీ చూశానని తెలిపారు. ఆ సినిమా స్ఫూర్తితోనే ఐదుగురు కొత్తవారితో ఒక కొత్త కథను రాసుకున్నానని నారాయణరావు తనతో చెప్పారని వెల్లడించారు. తనను కలవాలని అన్నారని… ఆ తర్వాత ఆ కథ గురించిన విషయాలు మాట్లాడిన తర్వాత ఇద్దరం కలిసి ఓ జ్ఞాపకంగా ఫొటో కూడా దిగామని చెప్పారు. బహుశా ఆయన తన చివరి ఆలోచనలను తనతో పంచుకున్నారేమో అని అన్నారు. ఎంతో ధైర్యవంతుడైన ఆయన హఠాన్మరణం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని చెప్పారు. నారాయణరావు ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
అంత్యక్రియులు పూర్తి
ప్రముఖ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు (73) అంత్యక్రియలు ముగిశాయి. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ఆయన అంతిమ సంస్కారాలు శాస్త్రోక్తంగా జరిగాయి. విదేశాల నుంచి వచ్చిన ఆయన కుమారుడు, కుమార్తె ఈ కార్యక్రమాలు పూర్తి చేశారు.అంతకుముందు, పలువురు సినీ ప్రముఖులు జీవీ నారాయణరావు భౌతికకాయానికి నివాళులర్పించారు. మెగాస్టార్ చిరంజీవి, సీనియర్ నటుడు మురళీ మోహన్‌తో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జీవీ నారాయణరావు బుధవారం రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే.1976లో కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘అంతులేని కథ’ చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేసిన జీవీ, ఆ తర్వాత ఎన్నో చిత్రాలు, టీవీ సీరియళ్లలో విలక్షణ పాత్రలు పోషించారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా ఆయన తనదైన ముద్ర వేశారు.
=======================